కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎంతోకాలంగా ఎన్నికల నినాదంగా మారిన కొడంగల్- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు (Kodangal Lift Irrigation Project)
ఎట్టకేలకు మోక్షం లభించింది. పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అయితే, ఇంకా బాలారిష్టాలు మాత్రం వీడటం లేదు. తన కలల ప్రాజెక్ట్ తరచూ చెప్పుకునే రేవంత్ రెడ్డి సీఎం అయిన ఆరు నెలల్లోనే ఈ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే భూసేకరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎకరాకు రూ. 10 లక్షలు పరిహారం ఇస్తామని సైతం ప్రకటించారు. అయితే దీనికి ఆయకట్టు రైతులు ఒప్పుకోలేదు. ఇంత తక్కువ ధరకు భూములు ఇవ్వమని ఖరాకండిగా చెప్పారు. భూసేకరణకు వెళ్లిన అధికారులపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఎకరాకు రూ.40 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని తెగేసి చెప్పేశారు. దీంతో, స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట బహిరంగ వేదిక ద్వారా భూపరిహారం రూ. 20 లక్షలు ఇస్తామన్నారు.
రూ.40 లక్షలకు రైతుల పట్టు..
కొడంగల్ లిఫ్ట్ పనుల కోసం భూములు ఇవ్వాలని.. రైతులు పెద్ద మనసు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీంతో, కొన్ని గ్రామాల్లో భూసేకరణ పనులు కొనసాగినా, మరికొన్ని గ్రామాల్లో రైతులు ఇంకా పట్టు వీడడం లేదు. ఎకరాకు రూ. 40 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని అంటున్నారు. ఇటీవల అధికారులు కానుకుర్తి గ్రామంలో పనులు ప్రారంభించారు. అయినా, రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఎలా ముందుకు వెళుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నారాయణ పేట నియోజకవర్గాలు ఉన్నాయి.
ప్రాజెక్టు ముఖ్య ఉదేశ్యం ఇలా..
ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు టీఎంసీల నీటిని మూడు పంపుహౌస్‌ల ద్వారా తరలిస్తారు. ఒకటో ప్యాకేజీ కింద రూ.1179.24 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1172.79 కోట్లకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. రెండు ప్యాకేజీల్లో పంపుహౌస్‌లు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం మక్తల్ మండలంలో 155.38 ఎకరాలు, ఊట్కూరులో 235, నారాయణపేట 94.14, దామరగిద్ద మండలంలో 75.16 ఎకరాలు సేకరించనున్నారు. అందులో 17.17 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు లైడార్ సర్వే కూడా నిర్వహించారు. భూసేకరణ పనులు పూర్తవుతే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన సీఎం మాటలు ఆచరణలో నిజమవుతాయా ?లేదా? వేచి చూడాల్సిందే.
Read Also: హైదరాబాద్‌కు జగన్ మకాం.. సెంటిమెంట్ ఫాలో అవుతారా!
Follow Us On: X(Twitter)

