కలం, హైదరాబాద్: తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ప్లాన్ అమలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు తోడుగా నాలుగో మహానగరంగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరి-అర్బన్, రూరల్ అగ్రి అని మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు..
యువతను అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా మార్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను హైటెక్ డిజిటల్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే మోడల్‌గా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహార ‘బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం ‘మధ్యాహ్న భోజన’ సౌకర్యాన్ని విస్తరించామన్నారు.
మూసీకి పూర్వ వైభవం..
లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని శుద్ధి చేసి, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రా’ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రకృతి వనరులను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలతో సుపరిపాలన..
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వేగంగా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు, ఐఓసీ ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.

