కలం, వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగంలో పదవీ విరమణ సహజమైనదేనని, అయితే ఉద్యోగ జీవితంలో నిజాయితీతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన వారిని సమాజం ఎప్పటికీ గౌరవిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన నేనావత్ కబీర్దాసు సన్మాన కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కబీర్దాసు, ఆయన సతీమణిని శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో సంపాదించిన అనుభవం, పరిజ్ఞానం, సామాజిక బాధ్యతను ప్రజల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఉద్యోగ విరమణతో సేవలు ముగిసిపోవని, అది కొత్త జీవితానికి ఆరంభమని పేర్కొన్నారు. మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకు, సమాజాభివృద్ధికి అంకితం చేస్తేనే ఉద్యోగ జీవితానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

