కలం, కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్ అని, కూలేశ్వరం కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ‘కాళేశ్వరం బాట’ కార్యక్రమం నిర్వహించారు. వినోద్ కుమార్‌తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సుంకె రవిశంకర్ కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి మేడారం నంది పంప్‌హౌజ్, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్‌ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు.
గ్రావిటీ అంటే మంత్రులకు తెలుసా..?
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి 140 మీటర్లు, మేడారం నంది పంప్‌హౌజ్ 230 మీటర్లు, రామడుగు గాయత్రి పంప్‌హౌజ్ 331 మీటర్లు, రామడుగు వద్ద గాయత్రి పంప్‌హౌజ్‌లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్ మానేరులోకి నీరు వెళ్తుందన్నారు. తెలంగాణలో కరువు రావడానికి కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించారు. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు మైత్రి అధినేత జైపాల్ రెడ్డి, తుల ఉమ, చల్ల హరిశంకర్, రవీందర్ సింగ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

