బండి సంజయ్ అంశంపై కిషన్‌రెడ్డి సైలెంట్

కలం, తెలంగాణ బ్యూరో : పోక్సో కేసులో బండి భగీరధ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఈ కేసు విచారణ పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలోనే ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. విచారణ రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉన్నప్పుడు తాను ఇంతకు మించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అనే అంశంపై తాను కామెంట్ చేయలేనని ఆయన (Kishan Reddy) స్పష్టం చేశారు. భగీరథ విషయంలో ఎలాంటి విచారణ చేయాలన్నది రాష్ట్ర పోలీసుల పరిధిలోని అంశమన్నారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, గతంలో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలకు అలాంటి స్వతంత్ర వ్యవస్థ ఉంటుందని, ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ అదే వర్తిస్తుందన్నారు.

‘సర్’పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ :

కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లకు దేశం మొత్తం మీద ఒక్క ఓటు మాత్రమే ఉండాలన్నారు. కొన్ని లోపాల కారణంగా కొందరికి ఓటు పది ప్రాంతాల్లో చూపిస్తున్నదన్నారు. దీన్ని సరిదిద్దడానికే ‘సర్’ అని తెలిపారు. డబుల్ ఎంట్రీలు లేకుండా, బోగస్ ఓటర్లు లేకుండా జాబితాను సరిదిద్దడం అందరి బాధ్యత అని అన్నారు. ఆ పనిలో భాగంగానే పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్కో ఇంటికి మూడుసార్లు వెళ్తున్నారని తెలిపారు. ‘సర్’ చేస్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, బీజేపీ కార్యకర్తలు కాదన్నారు. కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఏ ఆధారంతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆ కుట్ర ఏంటో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ పార్టీల నేతలూ బీఎల్వోలతో వెళ్ళాలి :

‘సర్’ ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా బీఎల్వోలతో పాటు ఇంటింటి వివరాల సేకరణకు వెళ్ళాలని కిషన్‌రెడ్డి సూచించారు. కానీ ఏ ఆధారం లేకు,డా ఎలక్షన్ కమిషన్‌పై బురద జల్లవద్దని హితవు పలికారు. ఈ ప్రక్రియ గతంలో కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందన్నారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉంటే ఒక్కొక్కరిని వెతికి తొలగించాలని ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. విదేశీయులను తొలగిస్తే రాహుల్‌గాంధీకి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లో సర్ జరిగినప్పుడు విధుల్లో పాల్గొన్నది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందేనని గుర్తుచేశారు. ఈవీఎంల గురించి కేటీఆర్ వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. రెండుసార్లు గెలిచి రాష్ట్ర మంత్రి అయినప్పుడు ఈవీఎంలు మంచివేనా అని ప్రశ్నించారు. ‘సర్‌’ని రాహుల్‌గాంధీ వ్యతిరేకించినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>