కలం, ఖానాపూర్ : ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) కోరారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో అటవీ శాఖ నిబంధనలు, అధికారుల అభ్యంతరాల కారణంగా ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడ్డంకులను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

