కలం, ఖమ్మం బ్యూరో : ఆటలతోనే ఆరోగ్యకరమైన సమాజం, శారీరక దృఢత్వం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. మంగళవారం పాల్వంచ శ్రీనివాస కాలనీలో ‘శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్స్-2026’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందడుగు వేయాలన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలితా కుమారి, ఫౌండేషన్ నిర్వాహకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

