మిర్యాలగూడలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో ఎంతంటే?

‎కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ (Miryalaguda) నియోజకవర్గంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరల భారం నుంచి ఊరట కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన బీపీటీ సన్నబియ్యాన్ని కిలో రూ. 66 చొప్పున అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే అధికారికంగా ప్రారంభించారు.

ఎల్‌నినో ప్రభావం, దళారుల కృత్రిమ కొరత కారణంగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే బత్తుల ప్రత్యేక దృష్టి సారించి మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను ఒప్పించి తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉండేలా నియోజకవర్గంలోని ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సామాన్యులపై నిత్యావసరాల భారం పడకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ పంపిణీ కేంద్రం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో రమణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు గౌరు శ్రీనివాస్, కర్నాటి రమేష్, అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>