కలం, ఖమ్మం బ్యూరో: వాహనదారులు హెల్మెట్ ను తలకు భారంగా భావించకుండా ప్రాణాలకు భద్రత కల్పించే రక్షణ కవచంగా చూడాలని ఖమ్మం పోలీసులు (Khammam Police) కోరారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా చేస్తున్న ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం పోలీసు యంత్రాంగం సోమవారం అవగాహన (Helmet Awareness) కార్యక్రమం చేపట్టింది. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ప్రమాదం జరిగితే తలకు తగిలే దెబ్బల వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుకున్న వారవుతారని చెప్పారు.
అందుకే బాధ్యత గల పౌరులుగా భావించేవారు ఎవరైనా బండి స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకోవడం ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సురక్షితమైన ప్రయాణాలను ప్రోత్సహించేందుకు హెల్మెట్ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఖమ్మం కార్పొరేషన్లో (Khammam Corporation) గల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హెల్మెట్ ధరించని వాహనదారులతో మాట్లాడి, హెల్మెట్ అవశ్యకతను వివరిస్తున్నారు. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని వారు పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశ్యంతో “హెల్మెట్ ఆన్.. లైఫ్ ఆన్” వంటి నినాదాలతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన (Helmet Awareness) పెంచుతూ, ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా హెల్మెట్ ఎలా రక్షిస్తుందో ఈ అవగాహన ద్వారా వివరించారు. ఈ సందర్బంగా ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి సురక్షితమైన ప్రయాణం చేయాలన్నారు. మన కోసం, మన ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తుంటారని, మన ప్రాణాలు మన కుటుంబానికి ఎంతో ముఖ్యమనే విషయం గుర్తించుకోవాలని వివరించారు.
Read Also: సగం ఆదాయం జీతాలు, పెన్షన్లకే.. అంచనా చేరని లక్ష్యం..!
Follow Us On: Instagram

