కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్కో పద్దు కింద అంచనాలు ఎలా వేసుకున్నా వాస్తవరూపం దాల్చడంలో మాత్రం అగాధం మాత్రం ఎక్కువే. ఆదాయ వనురుల్లో నాల్గింట మూడొంతులు మాత్రమే సాకారమవుతున్నది. మిగిలినదంతా అంచనాగానే మిగిలిపోతున్నది. రిజర్వు బ్యాంకు (Reserve Bank of India) నుంచి అప్పులు తీసుకోవడంలో మాత్రం లక్ష్యాన్ని పర్‌ఫెక్ట్ గా చేరుకుంటున్నది. ఆదాయం తగ్గుతుండడంతో ఆ మేరకు సంక్షేమ పథకాలకు చేసే ఖర్చుపైనా ప్రభావం పడుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) గతేడాదికి సంబంధించిన చేసిన విశ్లేషణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర సర్కార్ సొంతంగా ఆర్జిస్తున్న ఆదాయంలో దాదాపు సగం మేర ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు (Salaries), రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు (Pensions), పాత అప్పుల (Debt Payment) చెల్లింపులకే ఖర్చు చేస్తున్నది. ఉద్యోగుల జీతాలకు రూ. 37,521 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు రూ. 16,942 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక పాత అప్పుల రీపేమెంట్ కోసం రూ. 27,803 కోట్లను ఖర్చు చేసింది. కొన్ని సందర్భాల్లో రోజువారీ ఖర్చుకు పైసలు లేకపోవడంతో ఆర్బీఐ (RBI) నుంచి చేబదుళ్లు తీసుకుని సర్దుబాటు చేయాల్సి వస్తున్నది.
సొంత ఆదాయంలో భారీ వ్యత్యాసం :
రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం (2024-25) సొంతంగా రూ. 2.21 లక్షల కోట్లను ఆర్జించనున్నట్లు లక్ష్యం పెట్టుకున్నది. కానీ అందులో 76% మాత్రమే సాకారమైంది. కేంద్ర పన్నుల్లో వాటాతో కలిపి రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే ఆర్జించగలిగింది. కేంద్రం నుంచి గ్రాంట్లు, సాయం రూపంలో భారీగానే వస్తుందని అంచనా వేసుకున్నా ఆ లెక్క తప్పింది. మొత్తం రూ. 21,636 కోట్లు వస్తుందని లెక్కలేసుకుంటే చివరకు రూ. 7,913 కోట్లు మాత్రమే వచ్చింది. స్టాంపు డ్యూటీ, మైనింగ్, ఇసుక తదితరాల రూపంలో రూ. 35,208 కోట్లు వస్తుందనుకుంటే రూ. 23,608 కోట్లు మాత్రమే వచ్చింది. అన్ని రూపాల్లో రాష్ట్రానికి రూ. 2.74 లక్షల కోట్లు వస్తుందనుకున్న అంచనాల్లో రూ. 2.18 లక్షల కోట్లే వచ్చింది. దాదాపు రూ. 56 వేల కోట్ల అంచనా తప్పింది. ఈ కారణంగా మొత్తం ఖర్చు కూడా ఆ మేరకు తగ్గించుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువ ఎఫెక్టు పడింది.
పబ్లిక్ రుణాలతో రెగ్యులర్ సర్దుబాటు :
రిజర్వు బ్యాంకు నుంచి చేబదుళ్ళు, ప్రజా రుణం (Public Debt) రూపంలో మొత్తం పన్నెండు నెలల్లో రూ. 1.89 లక్షల కోట్లు తీసుకుని సర్దుబాటు చేసుకున్నది. అందులో తిరిగి రూ. 1.42 లక్షల కోట్లు చెల్లించింది. మిగిలినది బకాయిగా మిగిలిపోయింది. అటు అప్పులు, ఇటు చేబదుళ్ళు, ఇంకోవైపు ఆదాయం… వీటన్నింటినీ కలుపుకుని రూ. 4.47 లక్షల కోట్లలో రూ. 31,229 కోట్లు అదనంగా అంచనాకు మించి ఖర్చయినట్లు తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 14,296 కోట్ల ఆదాయం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రూ. 8,473 కోట్లకు పడిపోయింది. స్టేట్ ఎక్సయిజ్ పన్నుల ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది.

