కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిల హంగామాకు పోలీసులు చెక్ పెట్టారు. నడిరోడ్డుపై తల్వార్లతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, సోషల్ మీడియాలో ‘గ్యాంగుల’ పేరుతో బెదిరింపులకు పాల్పడటం వంటి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గురువారం రాత్రి నగరంలోని ఘట్టయ్య సెంటర్లో నడిరోడ్డుపై తల్వార్ వంటి పదునైన ఆయుధాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చింతకాని మండలం, చిన్నమండవ గ్రామానికి చెందిన వోలోజీ రాకేష్ (21)ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. నడిరోడ్డుపై కత్తులు, తల్వార్లు ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఆయుధాల ప్రదర్శనలతో కూడిన వీడియోలు, పోస్టులు పెట్టినా కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మరో ఘటనలో, ‘చంటి భాయ్ గ్యాంగ్’ పేరుతో గ్రూపులుగా ఏర్పడి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా పోస్టులు, వీడియోలు పెడుతున్న నగరంలోని శుక్రవారపుపేటకు చెందిన మహ్మద్ వజీద్ను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎండీ సాధిక్ పాషా మాట్లాడుతూ.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్యాంగుల పేరుతో హడావుడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిని ప్రత్యేకంగా గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

