కలం, మెదక్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనలో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్లపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) విమర్శించారు. గత వారం పది రోజులుగా ముఖ్యమంత్రి పర్యటనపై భారీ ప్రచారం చేసి, లక్షలాది మంది వస్తారని, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీసు బలగాలను మోహరించి చేసిన హడావుడి అంతా చివరకు తుస్సుమందని ఎద్దేవా చేశారు.
ఇంతటి ఆర్భాటం చూసి సిద్ధిపేట జిల్లాకు గొప్ప ప్రాజెక్టులు, భారీ నిధులు వస్తాయని ప్రజలు ఆశించారని, కానీ చివరకు అభివృద్ధి ప్రకటనలు లేకుండా సభ ముగిసిందని కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు . గజ్వేల్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్ధిపేట పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమి లేదని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలకు హుందాతనం ఉండాలని, దిగజారుడు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పదవికి గౌరవం తగ్గించవద్దని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు.
ప్రజాధనాన్ని ఖర్చు చేసి భారీ అధికార యంత్రాంగాన్ని సిద్ధిపేటకు తరలించడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ సభలుగా మార్చుకోవడం సరికాదని, రాజకీయ విమర్శలు చేసుకోవాలంటే పార్టీ ఖర్చులతో సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజల సొమ్ముతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సమస్య పరిష్కారం కోసం ఉపయోగపడాలన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తుండగా, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధులు విడుదల కావడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల సమస్యలనే పరిష్కరించలేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

