కలం, హనుమకొండ: చారిత్రక ఖిలా వరంగల్ కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించి, పరిరక్షించడంతో పాటు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. శనివారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డాక్టర్ సత్యశారదతో కలిసి ఎంపీ అభివృద్ధి పనులు, భూసేకరణ, పురావస్తు శాఖ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఖిలా వరంగల్ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలు, ఆలయాలను అభివృద్ధి చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దీనివల్ల పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

