కలం, ఖమ్మం బ్యూరో : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన యాతాలకుంట టన్నెల్ (Yatalakunta Tunnel) నిర్మాణం, లైనింగ్ పనులను ఆగస్టు మొదటివారం నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, రైతులకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్ అధికారులను ఆదేశించారు.
గురువారం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట టన్నెల్‌ను (Yatalakunta Tunnel) ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా సందర్శించారు. టన్నెల్ లోపలికి నడుచుకుంటూ వెళ్లి పనుల పురోగతి, లైనింగ్ నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యలను వారు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి పనుల వేగంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ (Collector Divakara) మాట్లాడుతూ, యాతాలకుంట టన్నెల్ పూర్తి కావడం ద్వారా సత్తుపల్లి ట్రంక్ కాలువ, రుద్రాక్షపల్లి, బేతుపల్లి ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ ప్రధాన కాలువకు నీటి సరఫరా సులభతరం అవుతుందని తెలిపారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు తరలించి ఆయకట్టు రైతులకు నీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ టన్నెల్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. రెండు వైపులా అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి మిగిలిన లైనింగ్ పనులను వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలానికే గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని, నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలని సూచించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పనుల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లు పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇరిగేషన్ శాఖ టన్నెల్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. కృష్ణ, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: X(Twitter)

