కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరపాలక సంస్థ 29వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ (Somidi Venu Prasad) తనపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపి అసలు సూత్రధారులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ)కి గురువారం రోజున ఫిర్యాదు చేశారు. కిసాన్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమ కబ్జాదారుల నుండి కాపాడేందుకు తాను చేస్తున్న కృషి వల్లే, కబ్జా కోరులకు తాను టార్గెట్గా మారానని సోమిడివేణు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుండటంతో, ఓర్వలేని వ్యక్తులు తనపై కక్ష పెంచుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ హత్యాయత్నానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారు తనకు పూర్తిగా అపరిచితులని, వారిపై ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని కార్పొరేటర్ తెలిపారు. వారు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్ భర్త అయిన ‘బాలరాజు’ అనుచరులని తనకు సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. భూ కబ్జాల విషయంలో తాను చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు బాలరాజు తన అనుచరుల ద్వారా పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేయించారని, దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
తాజా సంఘటన నేపథ్యంలో తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని వేణు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజాసేవలో ఉన్న తనను కాపాడాలని, తనకు తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని ఆయన సీపీని కోరారు. తెర వెనుక ఉండి కుట్రలు పన్నిన అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

