Mobile Popup Ad
Mobile Popup Ad

కేశినేని వర్సెస్ కేశినేని: భూ కుంభకోణంపై తెలంగాణ సీఎంకు లేఖ!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పై మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) (Kesineni Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషీగూడలోని కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఎంపీ చిన్ని పెద్ద కుంభకోణానికి తెరలేపారని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేశినేని నాని లేఖ రాశారు.

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఐటీ పార్క్ కోసం కేటాయించిన సర్వే నెంబర్ 57 లోని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఎంపీ తన పదవిని, రాజకీయ రంగాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు పన్నుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ భూ మాఫియా వెనుక ఎంపీ కేశినేని చిన్ని, ఆయన కుమారుడు కేశినేని వెంకట్ చౌదరి (మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్టనర్) బినామీ సంస్థగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.

మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈ 274.33 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి (పరంబోకు సర్కారీ) అని స్పష్టమైందని నాని గుర్తుచేశారు. పైగా ఈ భూమిపై గతంలో ఉన్న ప్రైవేట్ క్లెయిమ్‌లను కోర్టులు సైతం తిరస్కరించాయని వివరించారు. అయినప్పటికీ, సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఈడీ (ED) నోటీసులు, ఎన్‌సిఎల్‌టి (NCLT) స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, ప్రైవేట్ సెటిల్మెంట్ ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించడానికి ఈ సిండికేట్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం అక్కడ భారీ యంత్రాలతో అక్రమంగా బారికేడ్లు వేస్తున్నారని, ఈ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) ద్వారా తక్షణమే చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఈ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్న ఎంపీ చిన్ని, ఆయన బినామీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>