కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి (Ambedkar Jayanti) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన చిరస్మరణీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తుందని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) ఘన నివాళులు అర్పించారు. అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ, కుల, మత, లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత ఫరిడవిల్లి, విశ్వనరుడుగా భారత పౌరుడు ఎదిగేందుకు దోహదం చేసేలా, రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైనదని అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతి రూపాన్ని, విగ్రహం రూపంలో నగర నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామన్నారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మొదటి పదేండ్ల పాలనలో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని గుర్తు చేశారు.

