కలం, ఖమ్మం బ్యూరో: పచ్చని రావి ఆకుల మీద రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు ఓ మైక్రో ఆర్టిస్ట్. ఖమ్మం జిల్లా కల్లూరు (Kallur) మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దంతాల సుధాకర్ అంబేద్కర్ జయంతి రోజు వినూత్నంగా నివాళి అర్పించారు. తనకు తెలిసిన లీఫ్ కటింగ్ ఆర్ట్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలను వివిధ రూపాల్లో ఆకులపై తీర్చిదిద్దడంతో స్థానికంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక్కో చిత్రానికి రెండు గంటల వరకూ సమయం పడుతుందని, ఆకుపై ఉన్నపై పొరను మాత్రమే తొలగిస్తూ, లోపల ఈనెలు దెబ్బ తినకుండా అత్యంత నైపుణ్యంతో చాలా జాగ్రత్తగా చిత్రాలను రూపొందించాల్సి ఉంటుందని సుధాకర్ వివరించారు. అలాగే రావి ఆకుల ఈనెలు దృఢంగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయన్నారు. సుధాకర్ టాలెంట్ ను, ఆకులపై చిత్రాలను విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు. నేడు రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి.

