epaper
Monday, March 2, 2026
epaper

టార్గెట్ హ‌రీశ్ రావు.. సిద్దిపేట‌లో క‌విత మ‌రో కీల‌క అడుగు

కలం, మెదక్ బ్యూరో: Kavitha vs Harish Rao | పార్టీ ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్న క‌ల్వ‌కుంట్ల‌ క‌విత సిద్దిపేటనే త‌న రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు చేయ‌బోతున్నారా..? సిద్దిపేట (Siddipet) నుంచి పోటీ చేయ‌డ‌మే కాకుండా, ఇక్క‌డి నుండే రాష్ట్ర‌వ్యాప్తంగా తన పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారా..? ఉద్య‌మాల పురిటిగ‌డ్డగా పేరున్న సిద్దిపేటను కవిత త‌న పార్టీ విస్త‌ర‌ణ‌కు కేంద్రంగా చేసుకోవడంలో ఉన్న వ్యూహ‌మేంట‌న్న‌ది తెలంగాణ రాజ‌కీయాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

పార్టీ ఆఫీసు కోసం స్థల పరిశీలన

సిద్దిపేట నుంచి పోటీ చేయ‌డ‌మే త‌న ఫ‌స్ట్ చాయిస్ అని ప్ర‌క‌టించిన‌ క‌విత.. పార్టీ ప్రకటన తర్వాత సిద్ధిపేట కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అందులో భాగంగా సిద్దిపేటలోనే పార్టీ ప్రధాన ఆఫీసు నిర్మించాల‌న్న‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీని కోసం స్థానిక జాగృతి నాయకులు పార్టీ ఆఫీసు నిర్మాణానికి అనువైన స్ధ‌లం కోసం ప‌రిశీల‌న చేస్తున్నార‌ని స‌మాచారం. సిద్దిపేట రింగు రోడ్డుకు ఆనుకొని నాలుగైదు ఎక‌రాల స్ధ‌లంలో ఆఫీసు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముందుగా సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు బీఈడీ కాలేజీని అద్దెకు తీసుకొని పార్టీ ఆఫీసు నిర్వహించాలని భావించారు. స్థానికంగా ప్ర‌త్య‌ర్థులు ఇబ్బందులు సృష్టించే అవ‌కాశం ఉంద‌ద‌న్న స‌మాచారంతో అద్దె బిల్డింగ్ బదులుగా సొంత‌ పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ప్ర‌సుత్తం సిద్ధిపేట రింగురోడ్డుకు చుట్టుప‌క్క‌ల క‌రీంన‌గ‌ర్ లేదా మెద‌క్ రోడ్డు వైపు స్ధ‌లం ఉంటే బాగుంటుద‌ని భావిస్తున్నారు. సిద్దిపేట త‌న ఫ‌స్ట్ చాయిస్ అని హరీశ్ రావు కు సవాల్‌ విరిసిన కవిత (Kavitha vs Harish Rao) ఇక్క‌డ సొంత‌ ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకొని ఎక్కువ స‌మ‌యం ఇక్క‌డే ఉంటూ ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సిద్దిపేటలోనే ఆఫీసు ఎందుకు?

సిద్ధిపేట నుంచి పోటీ చేసే అలోచ‌న ఉన్న క‌విత స్థానిక‌ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డానికి వీలుగా సొంత ఇల్లు నిర్మించుకోవాల‌ని భావిస్తున్నారు. ఎక్క‌డ ఉండైనా రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌వ‌చ్చు. కానీ, సిద్దిపేట‌నే ఎంచుకోవ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి. ఉత్త‌ర తెలంగాణలోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద‌క్ జిల్లాల‌కు సిద్దిపేట మధ్యలో ఉంటుంది. దీంతో ఈ జిల్లాలకు సంబంధించిన పార్టీ వ్య‌వ‌హారాల‌ను సిద్ధిపేట‌లో నిర్మించ‌బోయే పార్టీ ఆఫీసు కేందంగా నిర్వ‌హించ‌వ‌చ్చు. హైద‌రాబాద్‌లో ఉండే పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం త‌ర‌హాలోనే అన్ని సౌక‌ర్యాల‌తో ఐదు ఎక‌రాల్లో ఆఫీసు నిర్మాణం చేయ‌నున్నారు. పార్టీ ఆఫీసులో క‌విత ఉండటానికి ఇల్లు, పార్టీ కార్యాల‌యం, స‌మావేశాలు నిర్వ‌హించుకోవ‌డానికి విశాల‌మైన హాల్స్, వార్ రూం, డైనింగ్ హాల్, పార్టీకి సంబంధించిన ఇత‌ర ఆఫీసుల‌ను ఒకే ద‌గ్గ‌ర నిర్మించాల‌నే ఆలోచ‌న చేస్తునట్టు తెలుస్తోంది. బహిరంగ స‌భ‌ల‌ను సైతం నిర్వ‌హించుకోవ‌డానికి అనువుగా ఉండేలా స్థ‌లం ఎంపిక చేయాల‌ని చూస్తున్నార‌ట.

తెలంగాణ జాగృతి జ‌నం బాట రెండో విడ‌త వ‌చ్చే నెల‌లో ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా సిద్ధిపేట జిల్లాలో క‌విత ప‌ర్య‌టించ‌నున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మ‌య్యే వ‌ర‌కు స్ధ‌లాన్ని ఎంపిక చేసి భూమి పూజ చేయాల‌నే ప్ర‌ణాళికతో సిద్ధిపేట జాగృతి ప్ర‌ముఖులు ప‌ని చేస్తున్నారు.

కవితకు కలిసివచ్చేనా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌ టీఆర్ఎస్ పార్టీ పెట్టి.. 2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేసి గెలిచాడు. తర్వాత ఉద్యమానికి సంబంధించిన పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలకు సిద్దిపేటనే ఎంచుకున్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడి, రెండుసార్లు పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాడు. తండ్రి బాటలోనే సిద్ధిపేటనే రాజ‌కీయ కేంద్రంగా మార్చుకోవ‌డానికి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తుంది. మే నెలలో పార్టీ ప్రకటన తర్వాత కవిత సిద్ధిపేటకు రెగ్యులర్‌గా రావడంతో, పార్టీ పరంగా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి సిద్దిపేటలో పార్టీ ఆఫీసు పెట్టి, కార్యక్రమాలను నిర్వహిస్తే ప్రజలకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ కేంద్రంగానే తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కవిత మాత్రం అంద‌రికీ భిన్నంగా హైదరాబాద్‌తో పాటు సిద్ధిపేటను రాజకీయ కేంద్రంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: టఫ్ ఫైట్.. అంతర్మథనంలో కేసీఆర్ అండ్ కో

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!