కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయాల్లో క్షేత్ర స్థాయిలో తమ పార్టీని బలోపేతం చేసి.. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kavitha) పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగానే పాలమూరు గడ్డ మీదినుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు. తొలుత అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని.. అదేరోజు సాయంత్రం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో కవిత కీలక ప్రసంగం చేయనున్నారు.
పార్టీ స్థాపించిన తర్వాత.. ముఖ్యంగా కృష్ణానది జలాలపై ఆమె (Kavitha) దృష్టి సారించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో (Palamuru Rangareddy Project) రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సహా మూడు ప్యాకేజీల పనులను 11 ఏళ్ల తర్వాత కూడా ప్రారంభించకపోవడంపై ఉద్యమానికి కవిత శ్రీకారం చుట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టును సైతం రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ ప్రణాళిక ప్రకటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికీ కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవిత చెప్పుకొచ్చారు. సభా వేదికగా ద్వారా ఇదే అంశంతో కవిత ముందుకెళ్లనున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఆవిర్భవించిందని పార్టీ ఏర్పాటు సభలో ప్రస్తావించిన కవిత.. తొలుత తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాపై తన గళం విప్పనున్నారు. పార్టీ ఏర్పాటు సమయంలో కృష్ణా, గోదావరి నీళ్లను మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే కృష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Read Also: సీఎం రేవంత్ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ విజయం: ఆది శ్రీనివాస్
Follow Us On: Sharechat

