కలం, వెబ్‌డెస్క్ : ‘ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కూకట్ పల్లి లో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వారు చెరువులు, కబ్జాలు, పవర్ కోసమే బీఆర్ఎస్ లోకి వచ్చారు’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జాగృతి జనం బాట (Jagruthi Janam Bata)లో భాగంగా కూకట్ పల్లిలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ను శామిర్ పేట్ వద్ద ఏర్పాటు చేయడం వల్ల ఉప్పల్, రామాంతాపూర్ లాంటి ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారని తెలిపారు. 32 లక్షల జనాభా ఉన్న మేడ్చల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో హెల్త్ సెక్టార్ పూర్తిగా అధ్వాన్నంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని కవిత డిమాండ్ చేశారు.
మేడ్చల్‌లో హెల్త్, ఎడ్యుకేషన్ మాఫియాగా తయారయిందని కవిత (Kavitha) ఆరోపించారు. మేడ్చల్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చి హైదరాబాద్‌లో ఉన్న ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారన్నారు. గ్లోబల్ రైజింగ్ సిటీ అని చెప్పుకునే ప్రభుత్వం.. సమ్మిట్‌కు వచ్చిన డెలిగేట్స్‌ను ఒక్కసారి జవహర్‌నగర్‌కు తీసుకొస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. ఇక్కడి కాలనీలను చూస్తే హైదరాబాద్‌లో ఇంత భయకరమైన పరిస్థితి ఉందా అని ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎమ్మెల్యే అండ చూసుకొని కుత్బుల్లాపూర్‌లోని పరికి చెరువును కబ్జా పెట్టారని ఆరోపించారు. గతంలో మేడ్చల్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సమస్యలను పట్టించుకోకపతే చరిత్ర క్షమించదని కవిత పేర్కొన్నారు.
‘తెలంగాణ రైజింగ్ కాదు.. చాలా అన్యాయమైన పరిస్థితి లో తెలంగాణ ఉంది. కూకట్ పల్లిలో భూములు అమ్మకంతో ప్రభుత్వానికి రూ. 2 వేల కోట్లు వచ్చాయి. కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఆసియాలోనే అతి హౌసింగ్ బోర్డు కాలనీ అయిన ఇక్కడ ఒక స్టేడియం కట్టించాలి. ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కూకట్ పల్లి లో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. ఉద్యమం చేసిన వాళ్లను ఖాళీ చేసి బీటీ బ్యాచ్ మొత్తం ఇక్కడకు వచ్చేసింది. కాంగ్రెస్ వచ్చాక పెనం నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయ్యింది. మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకోకుండా కబ్జాలపై దృష్టి పెట్టారు. ఈ సమస్యలు చూశాక ప్రజల తరఫున ఇంకా బలంగా పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నా’ అని కవిత వెల్లడించారు.
Read Also: ఏకగ్రీవ ఎన్నికలపై కొత్త ట్విస్ట్
Follow Us On: Pinterest


