కలం ప్రతినిధి, నిజామాబాద్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) ఏకగ్రీవాల జోరు కనిపించిన విషయం తెలిసిందే. వేలం పాటలు, ఒత్తిళ్లు ఇలా కారణాలు ఏవైనా చాలా చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఏకగ్రీవ ఎన్నికలపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి విచారణ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇళ్ళలకగానే పండుగ కాదన్నట్టు పరిస్థితి మారిపోయింది.
విచారణ ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ, రెండో దశలో ఏకగ్రీవాలు అయిన వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఒకే నామినేషన్ దాఖలైన వివిధ వార్డులు, పంచాయతీల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో విచారణ జరుపుతున్నారు అధికారులు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, పెద్దకొడప్ గల్ మండలాల పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన కేంద్రాలను తహసీల్దార్లు సందర్శించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, గ్రామ ప్రజలతో మాట్లాడి విచారణ జరుపుతున్నారు.
వేలంపాట ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి
రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 415 గ్రామ పంచాయితీలు, 8304 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే నయానో భయానో తీర్మానం చేసి లేదా వేలం పాటల ద్వారా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గా దక్కించున్నట్టు విచారణలో తేలితే ఇక వాటి మీద ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోనున్నారు. విచారణ ఆధారంగా నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నారు. మరి ఈ విచారణ అనంతరం ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఆయా గ్రామాల్లో మళ్లీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారా? లేదంటే మరేదైనా చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.
Read Also: గ్రామస్తుల మేనిఫెస్టో.. తెలంగాణ డల్లాస్‌గా అంకాపూర్
Follow Us On: Pinterest


