కలం డెస్క్: బీఆర్ఎస్‌కు, ఆ పార్టీతో వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం సంక్రాంతి సెలవుల్లో ఉన్నారు. ఈ నెల 5న కౌన్సిల్‌లో మాట్లాడిన ఆమె.. మరుసటి రోజు జాగృతి నేతలు, విద్యార్థులతో సమావేశయ్యారు. ఆ తర్వాత నుంచి ప్రకటనలకే పరిమితమయ్యారు. దాదాపు వారం రోజులుగా జాగృతి కార్యాలయంలో సభలు, సమావేశాలు, సమీక్షలు లేవు. తదుపరి కార్యాచరణపైనా జాగృతి కేడర్‌కు స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వలేదు. సంక్రాంతి వెకేషన్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. కానీ ఆమె తన ఇంటిలోనే పలువురు మేధావులు, ఉద్యమకారులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తుపై దృష్టి సారించినట్లు సమాచారం.
సంక్రాంతి తర్వాతే బయటకు :
తెలంగాణ జాగృతి తరఫున జనంబాట ప్రోగ్రామ్ చేపట్టిన ఆమె ఇప్పటివరకు 19 జిల్లాల్లో పర్యటించారు. ఇంకా 14 జిల్లాల్లో టూర్ నిర్వహించాల్సి ఉన్నది. సామాజిక తెలంగాణే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె కులసంఘాలు, వివిధ ప్రజాసంఘాలతో భవిష్యత్ ప్రయాణం గురించి వివరించారు. అందరి సహకారంతో సమిష్టిగా నడుద్దామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 25న మొదలైన జనంబాట (Jagruthi Janam Bata) తొలుత రూపొందించుకున్న షెడ్యూలుకంటే కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశమున్నది. రాజకీయంగా అవకాశమిచ్చిన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి ప్రారంభించిన ఆ ప్రోగ్రామ్ మార్చి నెల దాకా కంటిన్యూ అయ్యే అవకాశమున్నది. మంచిర్యాలలో ముగించాలని తొలుత ప్రకటించినట్లుగానే అక్కడే ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటున్నారు.
పార్టీ ప్రకటనపైనా అప్పుడే క్లారిటీ :
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న మంచిర్యాలలో భారీ బహిరంగ సభతో ‘జాగృతి జనం బాట’ ముగియాల్సి ఉన్నది. కానీ ఇంకా 14 జిల్లాల్లో పర్యటించాల్సి ఉండటంతో కొన్ని రోజులు వాయిదా పడనున్నది. మంచిర్యాల వేదికగా ఎలాంటి హాట్ కామెంట్స్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను కౌన్సిల్ వేదికగా వివరించి కన్నీళ్ళు పెట్టుకున్న కవిత (Kavitha) ఒక రాజకీయ శక్తిగా తిరిగొస్తానని ప్రకటించడంతో ఆ రాజకీయ పార్టీ పేరును లేదా రాజకీయ భవిష్యత్తును మంచిర్యాల వేదికగా అనౌన్స్ చేసే అవకాశమున్నది. అక్కడి నుంచే పోటీ చేయనున్న అంశాన్ని కూడా నొక్కి చెప్పనున్నట్లు సమాచారం.
Read Also: మరణం.. నా చివరి చరణం కాదు.. నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి
Follow Us On: Sharechat


