కలం, వెబ్ డెస్క్: 2026-27 సంవత్సరానికిగాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై (Budget) తెలంగాణ జాగృతి చీఫ్ కవిత (Kavitha) ధ్వజమెత్తారు. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు కేవలం 4శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. రూ. 20 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేశారని కవిత గుర్తుచేశారు. ఇది ప్రజా ఉపయోగం లేని బడ్జెట్ అని మండిపడ్డారు.
ఎంబీసీకి ప్రత్యేక మినిస్ట్రీ ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఊసే లేదని, రాష్ట్రంలో ఎంబీసీలు ఇబ్బందులు పడుతున్నారని కవిత అన్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్టీకి మినిస్ట్రీ లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నారు. ఇది ఫేక్ బడ్జెట్ అని, విజన్ బడ్జెట్ కాదని కవిత తేల్చిచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లారని, కేంద్రం నుంచి రాబట్టాల్సిన 22 వేల కోట్ల నిధులను ఎందుకు తీసుకురాలేదని కవిత (Kavitha) ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు పెంచుకుంటూ పోతుందని, ఈ క్రమంలో ఒక్కో వ్యక్తిపై 2లక్షల 16 రూపాయల అప్పు ఉందని కవిత చురకలంటించారు. ఆరు గ్యారంటీలు, అమ్మాయిలకు స్కూటీలు, తులం బంగారం లాంటి పథకాలు కూడా అమలుచేయలేకపోయిందన్నారు. అలాగే తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని కవిత ఆరోపించారు.

