కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ (Iran – Israel War) మధ్య యుద్దం ఆగడం లేదు. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు పేరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) విమానయాన సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. మధ్యప్రాచ్యం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోని 11 దేశాల ఎయిర్ స్పేస్ ఉపయోగించకుండా సూచనలు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, కువైట్ దేశాలకు విమానాలు నడపకూడదని డీజీసీఏ స్పష్టం చేసింది.
అలాగే.. సౌదీ అరేబియా, ఒమన్ గగనతలాల్లోని కొన్ని నిర్దిష్ట భాగాల్లో 32,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో విమానాలు నడపకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ సూచనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్టు పేర్కొంది. మార్చి 28 వరకు లేదా తదుపరి మార్పులు చేసే వరకు ఈ సూచనలు అమలులో ఉంటాయని డీజీసీఏ వెల్లడించింది. ఎయిర్ సర్వీస్ సంస్థలు సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అయితే, ఇరాన్ – ఇజ్రాయెల్ (Iran – Israel War) వార్ తో భారతీయ విమనాయ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. యూరప్, అమెరికా ఇతర దేశాలకు వెళ్లే దూర విమానాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి వస్తోంది.

