epaper
Sunday, February 22, 2026
epaper

‘సిద్ధిపేట వేదిక’… కవిత సంచలన సవాల్!

కలం, తెలంగాణ బ్యూరో : సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై (Harish Rao) రోజుకో కామెంట్‌తో కల్వకుంట్ల కవిత (Kavitha) విరుచుకుపడుతున్నారు. తొలుత ‘దయ్యం’, ఆ తర్వాత ‘గుంట నక్క’, మరో సందర్భంలో ‘తెలంగాణ చంద్రబాబు’ అంటూ కామెంట్ చేశారు. రాజకీయంగా ఆయనను ఢీకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానికి కొనసాగింపే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దిపేట్ తన ఫస్ట్ ఛాయిస్ అనే ప్రకటన. సిద్దిపేట్ అడ్డా నుంచే హరీశ్‌రావుకు సవాలు విసరాలనుకుంటున్నారు. హరీశ్‌రావును పొలిటికల్‌గా తనదైన శైలిలో ఉచ్చులోకి లాగుతున్నారా? ఆయన అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? ఆయనను కేవలం సిద్దిపేట్‌కే పరిమితం చేసే వ్యూహమా ఇది? నిజంగా అక్కడ పోటీచేసి ఆయనను ఢీకొట్టే సత్తా కవితకు ఉన్నదా? ఇరవై ఏండ్లకు పైగా ఎదురులేని నాయకుడిగా ఉన్న ఆయనపై కవిత గెలుపు సాధ్యమేనా?.. ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు.

ఒక్క నిర్ణయంతో రెండు ప్రయోజనాలు :

కవిత (Kavitha) తీసుకున్న ఒక్క నిర్ణయం వెనక రెండు ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, దీర్ఘకాలంగా బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట్‌లో ఆ పార్టీ బేస్‌ను ద్వంసం చేయాలనేది. రెండోది, ఆ గడ్డపైనే హరీశ్‌రావును రాజకీయంగా డైల్యూట్ చేయాలనేది. కవిత కొత్తగా పెట్టబోయే పార్టీ బలపడే సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్, హరీశ్‌రావులను మాత్రం జనంలో పల్చన చేయాలనేది ఆమె ఉద్దేశంగా కనిపిస్తున్నది. రెండున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆమె గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ తీసుకున్న సస్పెన్షన్‌ నిర్ణయానికి గుణపాఠం నేర్పాలనుకుంటున్నారు. ఆ నిర్ణయానికి కారణమైన హరీశ్‌రావుపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇవి ఏ మేరకు నెరవేరుతాయి? ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరం.

హరీశ్‌రావును ఢీకొట్టే సత్తా ఉన్నదా? :

హరీశ్‌రావు రాజకీయాల్లోకి వచ్చింది మొదలు సిద్దిపేట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ 2004 ఉప ఎన్నికలో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి అదే సెగ్మెంట్‌లో వరుస విజయాలు సాధిస్తున్నారు. ఏటేటా ఆయన ఆదరణ పెరుగుతూనే ఉన్నది. ఆయనకు పడే ఓట్లుగానీ, ప్రత్యర్థి కంటే ఎక్కువగా సాధించిన మార్జిన్‌గానీ పెరుగుతూనే ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2018)లో అత్యధికంగా 1.18 లక్షల ఓట్ల మార్జిన్‌తో గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 79% ఒక్క హరీశ్‌రావుకే వచ్చాయి. 2023 ఎన్నికల్లో మార్జిన్ 82 వేలకు పడిపోయినా ఏ పార్టీ కూడా ఆయన గెలుపును ఆపలేకపోయింది. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన హరీశ్‌రావును ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏ రకంగా ఢీకొట్టగలరనేది కీలకమైన అంశం. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు క్షేత్రస్థాయిలో అందనంత దూరంలోనే ఉన్నాయి. హరీశ్‌రావు అడ్రస్‌ను గల్లంతు చేసేంత రాజకీయ శక్తి కవితకు ఉన్నదా అనేది చర్చనీయాంశం.

కేసీఆర్ ఎంట్రీతో సిద్దిపేట్ గులాబీ అడ్డా :

తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ చేరింది మొదలు సిద్దిపేట్ నియోజకవర్గం ఆయన కంట్రోల్‌లోనే ఉన్నది. ఫస్ట్ టైమ్ 1985లో టీడీపీ నుంచి పోటీచేసిన కేసీఆర్, ఆ తర్వాత 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2001లో జరిగిన ఉప ఎన్నికలో మరోసారి పోటీచేసి గెలిచారు. ఓటర్లలో ఉన్న తెలంగాణ ఆకాంక్షకు ప్రతిబింబమే ఈ గెలుపు అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ద్వారా గెలిచి 2004 వరకు ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ తర్వాత లోక్‌సభ బరిలోకి వెళ్ళిపోవడంతో సిద్దిపేట్ స్థానాన్ని హరీశ్‌రావు ఆక్రమించారు. అప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. కేసీఆర్, హరీశ్‌రావులకు మాత్రమే కాక బీఆర్ఎస్ పార్టీకే కంచుకోటగా ఉన్న సిద్దిపేట్‌లో కవిత నెగ్గగలరా అనే ప్రశ్నకు భవిష్యత్తే సమాధానం చెప్తుంది.

కవిత పొలిటికల్ ఫ్యూచర్‌పై ఎఫెక్ట్ :

సిద్దిపేటలో (Siddipet) హరీశ్‌రావుతో పొలిటికల్‌గా ఢీకొట్టడం కవితకు పులిమీద సవారీ, కత్తిమీద సాములాంటిదే. సిద్దిపేట్ ఫస్ట్ చాయిస్ అనుకుని పోటీచేస్తే పొలిటికల్ గ్రౌండ్ ‘హరీశ్‌రావు వర్సెస్ కవిత’గా మారుతుంది. హరీశ్‌రావు గెలిస్తే హీరో అవుతారు, కవిత (Kavitha) జీరోగా మిగిలిపోతుంది. ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటాయి. ఒకవేళ కవిత గెలిస్తే ఆమె ఇమేజ్ పెరగడంతో పాటు ఒకేసారి హరీశ్‌రావు, కేసీఆర్, బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్దిపేట్‌పై హరీశ్‌రావు, కవిత ఫోకస్ పెరిగి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా కవిత తన మాటకు కట్టుబడి సిద్దిపేట్ నుంచే పోటీ చేస్తారా?.. లేక హరీశ్‌రావుతో నెగ్గలేమనే భావనతో మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారో చూడాలి. మరోచోటికి వెళ్తే కవిత పారిపోయింది.. అంటూ ప్రచారం చేసుకోడానికి బీఆర్ఎస్, హరీశ్‌రావుకు ఒక అస్త్రం దొరికినట్లవుతుంది.

Read Also: రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>