epaper
Sunday, February 22, 2026
epaper

రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు

కలం, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత వ్యవసాయ సీజన్‌కు రైతుభరోసా (Rythu Bharosa) నిధులు ఎప్పుడు విడుదల అవుతాయన్నది సస్పెన్స్ గా మారింది. అధికారులకు సైతం దీనిపై స్పష్టత కొరవడింది. రైతులు పంట సాయం పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్రమంతా వరి నాట్ల పనులు పూర్తయ్యాయి. విత్తనాలు, నాట్లు, పురుగుమందులు, ఎరువుల కోసం రైతులు సొంత డబ్బుల్ని వాడుకున్నారు. కొందరు పంట పెట్టుబడిని అప్పుల ద్వారా సమకూర్చుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తే ఆ డబ్బును అప్పులు తీర్చుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో డైలమాలో పడ్డారు. సంక్రాంతి గిఫ్టుగా అందుతుందని తొలుత లీకులు వచ్చాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే అందుతాయన్న వార్తలు వెలువడ్డాయి. కానీ అది ‘అందని ద్రాక్ష’గానే మిగిలిపోయింది.

డిజిటల్ మ్యాపింగ్, శాటిలైట్ ఇమేజ్ చిక్కులు :

సాగులో ఉన్న భూములకే రైతుభరోసా సాయాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. సాగులో ఉన్న భూముల లెక్క తేల్చే పని రెండు నెలల క్రితమే మొదలైంది. ఇందుకోసం శాటిలైట్ ఇమేజ్, డిజిటల్ మ్యాపింగ్ పద్ధతులను ప్రభుత్వం ఎంచుకున్నది. సమగ్రమైన డేటాను వ్యవసాయ శాఖకు అందిస్తే దానికి అనుగుణంగా రైతుభరోసా నిధులు విడుదల చేస్తుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం భూముల ‘డిజిటల్ సర్వే’ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఒకటిన్నర నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలని స్పష్టత ఇచ్చింది. ఒకవైపు డిజిటల్ సర్వే మరోవైపు శాటిలైట్ ఇమేజెస్, మ్యాపింగ్ కారణంగా సాగుభూముల లెక్క అగమ్యగోచరంగా మారింది. ‘సాగులో ఉన్న భూములకే’ రైతు భరోసా సాయం అని ప్రభుత్వం నిబంధన పెట్టిన కారణంగా లెక్కలు తేలేదెన్నడో.. సాయం అందేదెన్నడో.. అనే అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతున్నది.

45 రోజుల్లో ముగియడం సాధ్యమేనా? :

రాష్ట్రాన్ని ఇటీవల సందర్శించిన కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి వెల్లడించిన సమాచారం మేరకు ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రాం’ కింద దేశంలో అన్ని రాష్ట్రాల్లో భూముల డిజిటల్ సర్వే జరగాలి. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పూర్తయింది. తెలంగాణాలో కూడా వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర ఎకరాల మేర సాగుభూములున్నాయి. కేంద్రం సూచన ప్రకారం 45 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అనే అనుమానాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వ్యక్తం చేశారు. భూముల సర్వే కోసం రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వేయర్ల కొరత సర్కారును వెంటాడుతోంది. క్షేత్రస్థాయిలో కేవలం 3, 800 మంది మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులున్నారు. ఇందులో 1800 మంది మహిళలు. రాష్ట్రంలోని 10,877 గ్రామాలను ఒక్కో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. అయినా మరో 7,077 గ్రామాలు మిగులుతాయి.

ఖజానాలో కాసుల్లేకనే ఆలస్యం :

భూముల డిజిటల్ సర్వే పూర్తి చేయాలంటే 45 రోజులు అవసరమనే ప్రాక్టికల్ ఇబ్బంది ఒకవైపు.. సాగుభూముల్ని గుర్తించడానికి శాటిలైట్ ఇమేజెస్ తప్పనిసరి అనే నిబంధన మరోవైపు.. వీటన్నింటి కారణంగా రైతుభరోసా (Rythu Bharosa) సాయం ఎప్పుడనేది అధికారులకు సైతం స్పష్టత లేకుండాపోయింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేనందువల్లనే తాత్సారం చేస్తున్నదనే విమర్శలూ లేకపోలేదు. గత సీజన్‌కు తొమ్మిది రోజుల్లోనే సుమారు 67 లక్షల మంది రైతులకు రూ. 8,284 కోట్ల మేర నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. సుమారు 1.38 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందింది. ఈసారి ‘సాగుభూములకే’ అనే షరతు పెట్టడంతో ఆ లెక్క తేలేదాకా నిధుల విడుదల సాధ్యం కాకపోవచ్చు. ఆ గణాంకాలు వచ్చేంతవరకు ఎంతమంది లబ్ధిదారులు, ఎన్ని ఎకరాల భూమికి, ఎంత మొత్తం అనే అంశాలపై స్పష్టత రాకపోవచ్చు. గత సీజన్‌లో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా ఎలాంటి షరతుల్లేకుండా ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

Read Also: కెరీర్ పీక్స్​లో అర్ధాంతరంగా ఆగిన జీవితాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>