కలం డెస్క్ : సమీప బంధువైన హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మరో బాంబు పేల్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని 13 గ్రామాల పరిధిలో హరీశ్‌రావుకు సుమారు 400 ఎకరాల భూమి ఉన్నదని, ఇందులో ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ కూడా ఉన్నదని, ఈ భూములకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతోనే రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయని ఆమె ఆరోపించారు. జనం జాగృతి జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మెదక్ జిల్లాను సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ, హరీశ్‌రావు(Harish Rao)తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar), ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కు సైతం ఈ మండలంలో భూములు ఉన్నట్లు తెలిపారు.
నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో 56 మంది రైతులకు చెందిన 59 ఎకరాల భూమి రీజినల్ రింగు రోడ్డులో పోతున్నట్లు తనతో ఆవేదనగా చెప్పారని, అదే సమయంలో హరీశ్‌రావుకు చెందిన 400 ఎకరాల భూములకు ఇబ్బంది రాకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగేలా ప్రయత్నించారని కవిత ఆరోపించారు. రెడ్డిపల్లి గ్రామంతో పాటు చిప్పలకుర్తి, తునికి గ్రామాల మధ్య కూడా హరీశ్‌రావుకు భూములు ఉన్నాయని, వీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకే అలైన్‌మెంట్‌లో మార్పులు చేయించుకున్నారని అన్నారు. ఈ భూముల్లో కట్టుకున్న ఫైవ్ స్టార్ తరహా రిసార్టును చూసేందుకు స్థానికులు వెళ్ళడానికి ప్రయత్నించినా అనుమతి దొరకలేదని, చివరకు దొంగచాటుగా వెళ్ళి చూసి వచ్చారని ఆమె ఆరోపించారు. అక్కడి ప్రజలందరికీ ఈ ఫామ్ హౌజ్ హరీశ్‌రావుకు చెందినదేననే విషయం స్పష్టంగా తెలుసన్నారు.
గంగుల కమలాకర్‌కు 15 ఎకరాల భూమి :
ఇదే మండలంలోని చిన్న చింతకుంట గ్రామంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు 15 ఎకరాల భూమి ఉన్నదని, ఇందులో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే స్థానిక ప్రజలు వ్యతిరేకించారని కవిత గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ భూమిపై హక్కులు ఆయనకే ఉన్నట్లు ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు స్పష్టత లేకపోయినా ప్రజలు తనకు చెప్తున్నారని వివరించారు. ఈ భూమికి ఇబ్బంది రాకుండా రీజినల్ రింగురోడ్డు అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ఇదే మండలంలో ఎమ్మెల్సీ నవీన్ రావుకు కూడా 18 ఎకరాల భూమి ఉన్నదని, దీనికి ఇబ్బంది రాకుండా అలైన్‌మెంట్‌ను మార్పించుకున్నట్లు స్థానికులు చెప్తున్నారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ టార్గెట్‌గా కవిత కామెంట్స్ :
బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత(Kavitha) సస్పెండ్ అయిన తర్వాత ఆమె స్వరం మారింది. ఆ పార్టీకి చెందిన నేతల బండారాన్ని ఒక్కో సందర్భంలో ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్‌రావుకు రాజకీయంగా పట్టు ఉన్న నేపథ్యంలో ఆయనే టార్గెట్‌గా అనేక అంశాలను ఏకరువు పెట్టారు. పార్టీలో ఆయన పెత్తనాన్ని ప్రస్తావించి చాలా మంది బైటకు వెళ్ళిపోయేలా చేశారని ఇంతకాలం ఆరోపించిన కవిత.. ఇప్పుడు ఆయన ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి వారే కారకులనే ఉద్దేశంతో వారిని టార్గెట్ చేస్తున్నారు.
Read Also: అన్నకి సలహా ఇచ్చిన కవిత
Follow Us on: Youtube

