కలం డెస్క్: పుట్టింటి పార్టీని, ఆ పార్టీతో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. త్వరలో కొత్త పార్టీ (Kavitha New Party) స్థాపించనున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తన పాత్ర పోషించడం లేదని నేరుగా బీఆర్ఎస్‌పై ఫైర్ అయిన ఆమె.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా తాము ఎదుగుతామని ఇప్పటికే ప్రకటించారు. ‘‘వ్యక్తిగా వెళ్తున్న.. భవిష్యత్తులో శక్తిగా వస్త’’ అంటూ సోమవారం శాసన మండలిలో భావోద్వేగంగా కవిత మాట్లాడారు.
రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ‘జాగృతి జనంబాట’ పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించి, అన్నివర్గాలను ఆమె కలుస్తూ వస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులు, వివిధ సెక్షన్ల ప్రజల వద్దకు వెళ్లి.. తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. రాబోయే ఉగాది నాటికి కవిత రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఊహాగానాలు చక్కర్లు కొడ్తున్నాయి.
బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు చేయడం మొదలుపెట్టినప్పుడు ట్విట్టర్లో పుట్టుకొచ్చిన ‘కవితక్క అప్డేట్స్’ ఖాతాలోనూ తాజాగా ఇదే అంశం ఉండటం ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే.. కవిత పెట్టబోయే పార్టీకి ఏ పేరు పెడ్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఆమె ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థనే రాజకీయ పార్టీగా మలుస్తారా? అన్న చర్చ మొదలైంది.

Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On : WhatsApp


