కలం, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ ప్రారంభ వేడుకలో కవిత (Kavitha) పాంచజన్యం (Panchajanyam) పూరించారు. ఇప్పుడు ఆ పాంచజన్యం వెనుక ఉన్న అసలు అర్థాన్ని కవిత వివరించారు. తమ పొలిటికల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన.. పాంచజన్యం అనే ఐదు అంశాలపైన పూర్తి దృష్టి సారిస్తుందని కవిత వెల్లడించారు. ఈ పాంచజన్యంలో కీలకంగా ఐదు అంశాలను తాము ఉంచామని వెల్లడించారు. శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు శ్రీకృష్ణుడు అధర్మంపై పాంచజన్యం పూరించి యుద్ధాన్ని ప్రారంభించారని, అదే విధంగా తాము కూడా ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు పాంచజన్యం అంశాన్ని తీసుకున్నామని చెప్పారు. ఈ పాంచజన్యంలో కీలకంగా ఐదు అంశాలు ఉంటాయని, వాటితో అధిక ప్రాధాన్యత విద్యకు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.
విద్యకు తమ పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కవిత వివరించారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబం కూడా తన సంపాదనలో 60శాతం విద్యకు కేటాయించేస్తుందని చెప్పారు. కానీ తమ పార్టీ ఎంత చదివినా ఉచిత విద్యను అందించాలన్న ఆలోచనలో ఉందని వివరించారు. ‘‘ఇప్పుడు మూడో తరగతి చదువుతున్న పిల్లోడు.. తమ ప్రభుత్వం వచ్చే సమయానికి 5వ తరగతికి వచ్చినా.. ఆ తర్వాత ఆ పిల్లోడు ఎంత చదవాలనుకున్నా సరే పైసా ఖర్చు లేకుండా తమ ప్రభుత్వమే అంతా భరిస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఉచిత విద్యను అందిస్తాం’’ అని కవిత చెప్పారు.
రెండోది వైద్యం అని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పుడు రూ.2 లక్షలు ఇచ్చారని, అప్పుడు ఇది సాధ్యమేనా అని అంతా అనుకున్నా ఇప్పుడు అది సాధ్యమవుతోందని చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మరింత దయనీయంగా మారాయని, క్యాన్సర్ వ్యాధి జ్వరం తరహాలో వచ్చేస్తోందని అన్నారు. దానికి తోడు ఆసుపత్రుల్లో పరిస్థితి మరే రకంగా ఉందని, వైద్యానికి ఆసుపత్రికి తీసుకెళ్తే మొదట రూ.2 లక్షలు అన్నా ఆ తర్వాత ఆ బిల్లు కాస్తా రూ.15 లక్షలకు కూడా వెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. ప్రపంచమంతా వైద్యానికి పెద్దపీట వేస్తూ లైఫ్ స్పాన్‌ను పెంచుకుంటుంటే.. తెలంగాణ మాత్రం అందులో వెనకబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం వస్తే మాత్రం ఎంత ఖర్చు అయినా వైద్యాన్ని ఉచితంగా అందించే చర్యలను తమ తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.
పాంచజన్యంలో మూడో అంశం వ్యవసాయం అని చెప్పారు కవిత. ‘‘మా పార్టీ జెండాలో ఆకుపచ్చ రంగు వ్యవసాయానికే గుర్తు. ప్రస్తుతం తెలంగాణ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లాల దగ్గర ధాన్యం పోసుకుని ఎర్రటెండలో కూడా రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కనీస మద్దతు ధర చేయడం లేదు. కొనమని చెప్తే రైతులు తమ దారి తాము చూసుకుంటారు కదా. కానీ మా ప్రభుత్వం వస్తే ఆ పరిస్థితి ఉండదు’’ అని కవిత అన్నారు. ప్రభుత్వాలు రైతు పరిస్థితులను రాజకీయం చేస్తున్నారే తప్ప.. వారి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని అన్నారు.
నాలుగో ప్రాధాన్యత మేము ఉపాధికి ఇస్తామని కవిత హామీ ఇచ్చారు. ఇవాళ ఉపాధి అంటే రాజకీయ అంశమైయింది తప్పితే ఆ దిశగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి విషయంలో తమ ప్రభుత్వం మూడు కేటగిరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘18-25 మధ్య వయసు ఉన్న వారి ప్రతి ఐడియాకు తమ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. 25-45 మధ్య వారికి ప్రతి ఒక్కరికీ కూడా తమ ప్రభుత్వం అవకాశాలు అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాదాన్యత ఇస్తాం. రూ.2లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు మీ టాలెంట్‌ను నమ్మి బ్యాంకులతో సంబంధం లేకుండా మేము పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఒక్క గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు వస్తే చాలు. జీవితం సెటిల్ అవుతుంది. ఒక్క మూడు ఇండస్ట్రీలు క్లిక్ అయినా రాష్ట్ర ఇన్‌కమ్మ ఆకాశమే హద్దుగా పెరుగుతుంది’’ అని చెప్పారు. దాంతో పాటుగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటాం అనుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ‘‘మొన్న 4లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తానంటే చాలా మంది నవ్వారు. ఎలా ఇస్తారని అడిగారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ఖాళీలు ఉన్నాయి. చాలా శాఖల్లో ఖాళీలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. టీచర్లు లక్షల మంది కావాలి. ఉర్దూ టీచర్లు కావాలి. ఏఐ వచ్చినా ఉద్యోగాల విషయంలో ముందుకు వెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు.
సామాజిక న్యాయంలో కూడా తమ ప్రభుత్వం వెనకడుగు వేయమని చెప్పారు. పాంచజన్యంలోని అన్ని అంశాల్లో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ సామాజిక న్యాయం అన్ని వర్గాల్లో అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం అందిస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్, ఓసీల్లోని పేదలకు, వికలాంగులకు, వారి తల్లిదండ్రులకు, సీనియర్ సిటిజన్లు, ప్రతి ఒక్కరికీ న్యాయం ఇలా అనేక అంశాలు ఈ సామాజిక న్యాయం అందించడంలో ఉంటాయని చెప్పారు. ఈ సామాజిక న్యాయాన్ని అమ్మతనంతోనే అందిస్తామని చెప్పారు. ఇవాళ్టి ప్రభుత్వాలకు అమ్మతనం లేకపోవడం వల్లే పరిపాలన సరిగా జరగం లేదని కవిత అన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది ఆమె ధీమా వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని.. ఎంత ఖర్చుకైనా వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తేడా లేకుండా పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామినిచ్చారు. ఎన్ని లక్షల రూపాయల ఖర్చయినా రాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామన్నారు. పైసల్లేక కళ్ల ముందు చనిపోయే పరిస్థితి ఉండదని చెప్పారు.
రైతుల సమస్యలకు ప్రభుత్వాలు పరిష్కారం చూపలేకపోతున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాల దగ్గర రైతులు మండుటెండలో పడరాని పాట్లు పడుతున్నా.. ప్రభుత్వం కొనడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు తెరవాలంటూ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రైతుల పంటలను ఎగుమతి చేయడానికి, ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులను విదేశాలకు పంపడానికి ప్రత్యేక పాలసీ తీసుకురావొచ్చు కదా.. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు అని కవిత విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన రైతుల గౌరవాన్ని, సంక్షేమాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది అని కవిత వెల్లడించారు.

