కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 13వ తేదీన ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ చేరికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం, అదే రోజున జగిత్యాలలో (Jagtial) భారీ బహిరంగ సభతో పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నేతగా పేరున్న జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి చాలా సమయం పట్టిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై కేవలం రెండున్నరేళ్లలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే ఈ పాలన పట్ల విసిగిపోయారని, రెండేళ్లకే ఆయన పదవి నుంచి దిగిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.
Read Also: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ముగ్గురు ఔట్, ఐదుగురు ఇన్
Follow Us On : WhatsApp

