కలం, వెబ్ డెస్క్: ప్రజల సమస్యల గురించి ప్రశ్నించెదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ప్రజల కోసం జాగృతి మాత్రమే పనిచేస్తుందని ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం.. అదే మా పార్టీ పంథా అని స్పష్టం చేశారు. బుధవారం కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ (Ranjith kumar) చేరారు. రంజిత్ తో పాటు పలువులు నాయకులు పార్టీలో చేరారు. రంజిత్ కు కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ ఎంతో కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని.. అందుకే ప్రజల కోసం పోరాటం చేసేందుకు జాగృతి పెట్టబోయే పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించానని చెప్పారు.
రంజిత్ జాగృతితో పాటు ఐదు నెలలుగా పనిచేస్తున్నాడని.. ఏ సమయంలోనైనా ఏలా స్పందిస్తామో ఆయనకు తెలుసు అని చెప్పారు. ఇప్పుడు మీరంతా జాగృతి మనుషులు అని.. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునే బాధ్యత తమది అని కవిత (Kavitha) భరోసా ఇచ్చారు. రాసి పెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఏప్రిల్ 25 అని పేర్కొన్నారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తామన్నారు. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటామని.. వారితోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం తెస్తామని కవిత వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఫైర్..
రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం గా మారిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్, హైడ్రా పేరుతో బెదిరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి (CM Revanth) నిలబడే మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో ఎందుకు నిలబడి మాట్లాడుతున్నావని తనతో పాటు సంచులు మోసిన వ్యక్తి అడిగితే.. భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి రాహుల్ ఫిర్యాదు చేస్తాడని రేవంత్ చెబుతున్నాడంట అంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నాకు కుర్చీ, నీకు మోయటానికి సంచులు ఉండవని అతనితో ముఖ్యమంత్రి చెబుతున్నాడంట అంటూ విమర్శించారు. ప్రజల సమస్యల గురించి అడిగితే “నో” రాహుల్ జీ అని.. కేరళ ఎన్నికలు, మనీ కావాలంటే మాత్రం “ఎస్” రాహుల్ జీ అంటూ గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు.
స్వయం పాలన కాదు.. ఢిల్లీ పాలన వచ్చింది..
తెలంగాణ వస్తే మనకు స్వయం పాలన వస్తుందని భావించాం.. కానీ ఢిల్లీ పాలన వచ్చిందని కవిత దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా వేయలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ఆగ్రహించారు. తెలంగాణలో అన్ని చేశామంటూ ఈ ముఖ్యమంత్రి కేరళకు వెళ్లి చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడని అన్నారు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాత్రమేనన్నారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని మెయింటెన్ చేస్తూ రేవంత్ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
సీడ్ పత్తి విత్తనాల రైతులకు ఇప్పటికీ ఇబ్బందులు..
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) తరఫున వచ్చే పార్టీ.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని కవిత హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామన్నారు. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్నారు. వెలుగుమట్లలో చేసిన పోరాటం మాదిరిగానే ఇంకా మూడేళ్ల పాటు పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పారు. గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి ఉద్యమకారుల జెండా ఎగరాలని ఆకాంక్షించారు. 70 ఏళ్ల గడీల పాలనలో కేతిదొడ్డి, గట్టు, ఐజా మండలాలు వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నాయని చెప్పారు. చేనేతలు, సీడ్ పత్తి విత్తనాల రైతులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతు సంఘర్షణ సభలో తాము సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే ఇప్పటి కూడా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదన్నారు.
చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం..
చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని కవిత (Kavitha) మండిపడ్డారు. వెంటనే వారికి ఇచ్చే ఆర్డర్లు, నూలు, రంగులు యథావిధిగా కొనసాగించాలన్నారు. జాగృతి తరఫున మొన్న సింహం గుర్తుతో పోటీ చేస్తే మొట్టమొదటి విజయం ఇచ్చింది గద్వాల్ జిల్లానేనని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ మొట్టమొదటగా గెలిచేది తమ్ముడు రంజిత్ అని నమ్ముతున్నానని చెప్పారు. బహుజనులు, ఉద్యమకారులకు రాజకీయాల్లో అవకాశాలు రావటం లేదని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా మోసే అచేతన స్థితిలో బీఆర్ఎస్ ఉందని దుయ్యబట్టారు. బహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో ఎంత సస్పెన్స్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడన్నది కూడా అంతే సస్పెన్స్ గా ఉందని ఎద్దేవా చేశారు.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On: Sharechat

