కలం, వెబ్ డెస్క్: మహిళలు కచ్చితంగా పవర్ ఫుల్ పొజిషన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పవర్ ఫుల్ పొజిషన్‌లో మహిళలు ఉంటేనే మార్పు సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన “చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.
మన శక్తిని ప్రదర్శించాలి..
బిల్లు సత్వరమే అమలు చేయాలంటే మన శక్తిని ప్రదర్శించాలని కవిత వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు అమలు చేయకుంటే ఓట్లు వేయమని మహిళలమంతా గట్టిగా చెప్పాలని కోరారు. మహిళల కోసం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. మహిళలంతా గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ అందుకు తగిన విధంగా మహిళ లీడర్లను కూడా తయారు చేసుకోవాలని చెప్పారు. మహిళలను లీడర్లుగా తయారు చేసేందుకు మనం స్పెషల్ డ్రైవ్‌లు కూడా నిర్వహించాలన్నారు.
ఆ ట్రెండ్ తీసుకురావాలి..
రాష్ట్రంలో మహిళ బిల్లు ఆమోదం కోసం తాము 2022-23 లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని కవిత గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌లో ఈ అంశంపైనే మాట్లాడాలంటూ 18 పార్టీలతో మాట్లాడించామని అన్నారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగి మహిళ బిల్లుకు ఆమోదం లభించిందని చెప్పారు. తమ పార్టీ పరంగా కచ్చితంగా 33 శాతానికి తగ్గకుండా మహిళలకు సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సరైన మహిళ నాయకులు ఉంటే 50 శాతం టికెట్లు ఇవ్వటానికి కూడా సిద్ధమని అన్నారు. మహిళా బిల్లు తేకపోతే ఓట్లు వేయమని మహిళలు చెప్పాలని.. ఆ ట్రెండ్‌ను తీసుకురావాలని చెప్పారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On : WhatsApp

