తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ఈసారి తన తండ్రి కేసీఆర్ హయాంలో అన్యాయాలు జరిగాయంటూ విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులను కేసీఆర్ హయాంలో ఎవరూ పట్టించుకోలేదని.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అమరవీరుల స్మృతిలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో కవిత రక్తదానం చేసి మాట్లాడారు. కేసీఆర్ దీక్ష, అమరుల బలిదానాలు, విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యం అయింది. కానీ తెలంగాణ వచ్చినా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్నారు.
కేసీఆర్(KCR) ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యమకారులను అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదని కవిత విమర్శించారు. ‘ఉద్యమంలో 12 వందల మంది అమరులయ్యారని కేసీఆర్ ప్రభుత్వమే చెప్పింది. కానీ 540 కుటుంబాలకు మాత్రమే సాయం చేశారు. వారికి కూడా కనీస గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రావతరణ రోజున పిలిచి శాలువాలు కప్పకుండా అవమానించారు. ఆ బాధ వారిలో ఉందని నేను గతంలోనే గుర్తించా. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
డిసెంబర్ 9 నాడు ఆ హామీలన్నీ అమలవ్వాలని లేదంటే జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ‘ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడకు ఉద్యమకారులను తీసుకెళ్లి ఆ భూమిని పంచుతాం. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ జాగృతి జెండాలు పాతుతాం’ అని ఘాటుగా కవిత(Kavitha) స్పందించారు.
Read Also: బీజేపీని నేలమట్టం చేస్తాం -సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: instagram


