కలం, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంత వేగంగా .. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన 900 ఎకరాలను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని విమర్శించారు. ‘వట్టెం రిజర్వాయర్ నిర్మించేందుకు మట్టి కోసం రైతుల దగ్గర 900 ఎకరాలు సేకరించారు. కానీ ఆ 900 ఎకరాల్లో మట్టి సేకరించలేదు. స్థానిక చెరువులు, కుంటల నుంచి మట్టిని ఎత్తిపోశారు. ఆ భూమిని మాత్రం కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు.’ అంటూ కవిత ఆరోపించారు. ఆ భూమి కోసం రైతులకు నామమాత్రంగానే పరిహారం చెల్లించారని వివరించారు. ఇప్పుడు ఆ భూమి ప్రాజెక్టు కోసం వాడుకోవడం లేదు కాబట్టి రైతులకు తిరిగి ఇచ్చేయాలని కవిత డిమాండ్ చేశారు.
రైలు కూత ఎందుకు వినిపించదు?
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు రైలు ఓ కలగానే మిగిలిపోయిందని కవిత (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఈ ప్రాంతానికి రైలు రాలేదని పేర్కొన్నారు. కనీసం గద్వాల మాచర్ల రైలు నాగర్ కర్నూల్ జిల్లాకు తీసుకురావాలని కోరారు. స్థానిక ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. ‘నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతం ఉంది. నల్లమల కొండల్లో చెంచు పెంటలున్నాయి. పద్నాలుగు ఏండ్ల క్రితం డిబీర్స్ అనే కంపెనీ మీద పోరాటం చేశామని గుర్తు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో మార్కెట్ రాలేదని పేర్కొన్నారు.
ఐటీడీఏలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 308 కిలోమీటర్లు ఈ జిల్లాలో పారుతోందని.. కానీ ఆ స్థాయిలో ప్రాజెక్టులు మాత్రం ఇక్కడ నిర్మించలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు వాడుకొనే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నదని.. నిజానికి ఈ జిల్లాలో సరైన ప్రణాళికతో ప్రాజెక్టులు నిర్మిస్తే 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా జలాలను భారీగా దోచుకుంటున్నదని.. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని కవిత ఆరోపించారు.
Read Also: శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పు: ప్రకాశ్ రాజ్
Follow Us On: X(Twitter)


