కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రైవేట్ దోపిడీ సాగుతోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. ప్రైవేట్‌ను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్‌కు వెళ్తున్నారని కవిత విమర్శించారు. ప్రైవేట్ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు సీఎం రేవంత్ సంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. ఇక ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విద్యా కమిషన్ రిపోర్ట్ చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఒక పాయింట్ బాగుందని కవిత అన్నారు. ఏటా ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజును 7 నుంచి 8 శాతం పెంచుకోవచ్చని సూచించారని, కనీసం ప్రభుత్వం ఈ ఒక్క విషయాన్ని అమలు చేయాలని సూచించారు. 8 శాతం కన్నా ఎక్కువ ఫీజు పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజులు పెరిగినట్లు, పిల్లల తల్లితండ్రులకు జీతాలు పెరగవని, అలాగే టీచర్ల జీతాలు పెంచరని కవిత అన్నారు. శ్రీచైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థల్లో కూడా టీచర్లకు పీఎఫ్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్ టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ స్కూల్స్ లో ఫుడ్ కూడా బాగుండటం లేదని, తాము డిమాండ్ చేస్తేనే ఫుడ్ సెక్యురిటీ టాస్క్ ఫోర్స్‌ను వేశారని చెప్పారు. నారాయణ, చైతన్య వంటి స్కూల్స్ లో ఒకే దగ్గర పది వేల మందికి ఫుడ్ తయారు చేస్తున్నారని, కొంచెం ఫుడ్ పాయిజన్ అయినా సరే పది వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. కార్పొరేట్ స్కూల్స్‌లో ఫుడ్ శాంపిళ్లను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా స్కూళ్లలో ఫీజులు ఎక్కువ, చదువు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. లక్ష మంది విద్యార్థులుంటే 100 మందికి మాత్రమే ర్యాంకులు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆ ర్యాంకులను చూసి ప్రజలు ఆగమై పిల్లలను ఆ స్కూళ్లలో చేర్పిస్తారని చెప్పారు.
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.42,000 ఇవ్వకపోవటంతో రూ.212 కోట్ల బకాయిలు అయ్యాయని కవిత వెల్లడించారు. ఆయా స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. బీసీల్లో ఆదాయం తక్కువ ఉన్న పిల్లలకు కూడా రూ.42 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, మ్యాచింగ్ గ్రాంట్ కట్టని, ఫుడ్ సరిగా లేని స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌కు సంబంధించి రూ.11 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి రూ.7,500 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించకపోవటంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని కవిత తెలిపారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని హైకోర్టు తీర్పు ఉన్నా కూడా ప్రైవేట్ యాజమాన్యాలు తీరు మార్చుకోవడం లేదన్నారు. ప్రభుత్వంతో పోరాడి బకాయిలు విడుదల చేస్తామని, కాలేజీ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్స్ వెంటనే ఇవ్వాలని కోరారు.

