Mobile Popup Ad
Mobile Popup Ad

పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రశాంతంగా నిద్ర (Sleep) అనేది ఒక లగ్జరీగా మారింది. పని ఒత్తిడి, నిరంతర స్క్రీన్ టైమింగ్ వల్ల ప్రజలు తీవ్రమైన అలసట, ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్ర కూడా సరిగా పోలేని పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది. రోజుకు 8 గంటల నిద్ర అనేది చాలా అరుదుగా వచ్చే వెకేషన్‌లా మారింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు పర్యాటకులు ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే ‘స్లీప్ టూరిజం’ (Sleep Tourism). అంటే కేవలం ప్రశాంతంగా నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం కోసమే ప్రత్యేకంగా పర్యటనలు ప్లాన్ చేయడం.

హోటల్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిద్ర అనేది కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి అత్యంత కీలకమైన అంశమని ప్రజలు గుర్తిస్తున్నారు. సిక్స్ సెన్సెస్ హోటల్స్ ప్రతినిధి మార్క్ సాండ్స్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ ప్రాధాన్యతల్లో నిద్ర రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. బిజీ లైఫ్ స్టైల్ వల్ల నిద్ర ఒక లగ్జరీగా మారిందని జేడబ్ల్యూ మారియట్ ప్రతినిధి ఉతామి ఇంద్రా దేవి అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు పర్యటనలు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రదేశాలను చుట్టేయడమే లక్ష్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారుతోంది. ప్రయాణం అంటే కేవలం చూడటం మాత్రమే కాదు, మనసును రీసెట్ చేసుకోవడం కూడా అని వెస్టిన్ హైదరాబాద్ ప్రతినిధి డాక్టర్ కుశాల్ బచాని వివరించారు. జిమ్ కార్బెట్ మారియట్ రిసార్ట్ జనరల్ మేనేజర్ పవన్ చాహర్ మాటల్లో చెప్పాలంటే.. పర్యాటకులు ఇప్పుడు అనుభవాల కంటే కూడా ‘విశ్రాంతి’ కోసమే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలు చేస్తున్నారు. ముల్ షేడ్స్ హోటల్ మేనేజర్ దుష్యంత్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. నిద్ర అనేది పర్యటనలో ఒక భాగం కాదు, నిద్ర కోసమే పర్యటన సాగుతోందని తెలిపారు.

ఈ టూరిజంలో ప్రత్యేకతలు ఇవే:

కాలుష్యం, శబ్దాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవడం. మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటూ డిజిటల్ డీటాక్స్ అవ్వడం. తద్వారా ఒత్తిడిని తగ్గించడం. యోగా, ధ్యానం, సౌండ్ హీలింగ్, అరోమా థెరపీ వంటి పద్ధతుల ద్వారా గాఢ నిద్రకు సహకరించడం. ఈ స్లీప్ టూరిజంలో రూమ్‌లను ఏర్పాటు చేయడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిద్రకు అనుకూలమైన పరుపులు, దుప్పట్లు, గది వాతావరణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. భవిష్యత్తులో ఈ స్లీప్ టూరిజం (Sleep Tourism) ఒక ప్రధాన పర్యాటక రంగంగా ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆధునిక జీవితంలో లోపించిన ప్రశాంతతను అందించే ఈ పద్ధతి, పర్యాటక రంగం నిర్వచనాన్ని మార్చివేసే అవకాశం ఉంది.

Read Also: హనీ కాఫీ లెమనేడ్ : ఈ వేసవిలో వైరల్ అవుతున్న రిఫ్రెషింగ్ డ్రింక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>