కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు (Telangana Cabinet Expansion) ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల సెకండ్ వీక్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండనున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన ఆదివాసీ, గిరిజన అంశాలపై సమావేశం సందర్భంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై స్వయంగా రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ముగ్గురికి ఉద్వాసన పలకొచ్చని, కొత్తగా ఐదుగురిని చేర్చుకునే అవకాశముందని ఆ వర్గాల సమాచారం. కానీ మంత్రివర్గంలో మాత్రం లంబాడా వర్గానికి చెందిన ఒకరికి తప్పనిసరిగా స్థానం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి.
ఈ మార్పులే చివరి వరకూ కంటిన్యూ :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నది. ఇప్పటికీ రెండు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. మిగిలిన రెండున్నరేళ్ల వరకు మంత్రివర్గాన్ని ముట్టుకోకుండా కంటిన్యూ అయ్యేలాగ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆలోచిస్తున్నారు. రాబోయే రెండున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా ప్రాధాన్యతా రంగాలను సమర్ధులైనవారికి కేటాయించేలా కొద్దిమంది మంత్రుల శాఖలు కూడా మారే అవకాశమున్నది. కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరొస్తారు.. ఇప్పుడున్న మంత్రుల్లో ఉద్వాసన ఎవరికి.. వారికి పార్టీపరంగా ఇవ్వాల్సిన బాధ్యతలేంటి.. వీటన్నింటిపై ఏఐసీసీ, పీసీసీ నేతలకు ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఏక కాలంలో డిప్యూటీ స్పీకర్ పోస్టు, కీలకమైన కార్పొరేషన్లకు నామినేటెడ్ పద్ధతిలో నియామకం, మంత్రివర్గంలో స్థానం.. సోషల్ జస్టిస్, జిల్లాల సమీకరణాలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం జరగనున్నది.
కేరళం అసెంబ్లీ ఎన్నికలతో లింక్ :
కేరళం అసెంబ్లీ ఎన్నికల (Kerala Elections) పోలింగ్ ఈ నెల 9న జరగనున్నది. ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ నెల 7తో ముగియనున్నది. అప్పటివరకూ ఏఐసీసీ నేతలతో పాటు తెలంగాణ పీసీసీ నాయకులు, మంత్రులు అక్కడి ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నది. దీంతో ఆ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై (Cabinet Expansion) అటు ఏఐసీసీ నేతలు, ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టనున్నారు. మంచి ముహూర్తాన్ని చూసి తేదీ ఫిక్స్ కానున్నది. ఉద్వాసనకు గురయ్యే మంత్రుల పేర్లు, కొత్తగా మంత్రులయ్యేవారి పేర్లపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నందున సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఏఐసీసీ లీడర్లు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ పేర్లన్నింటినీ ఏఐసీసీ నేతల దృష్టిలో పెట్టేందుకు సీఎం ఢిల్లీ పర్యటన ఖరారయ్యే అవకాశమున్నది. హైదరాబాద్ రిటన్ రాగానే మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి.
Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!
Follow Us On: Sharechat

