కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లికి చెందిన దాసరి ప్రీస్టన్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుత ప్రతిభతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Record)లో స్థానం సంపాదించుకున్నారు.
గుమ్మడివల్లికి చెందిన దాసరి వెంకటేశ్వర రావు, ప్రమీల దంపతుల కుమారుడైన ప్రీస్టన్‌కు చిన్నతనం నుంచే సంగీతంపై ఎనలేని మక్కువ. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒక మెగా మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆయన భాగస్వామ్యమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 దేశాల నుండి తరలివచ్చిన 2000 మంది ప్రముఖ కీబోర్డ్ కళాకారులతో కలిసి ప్రీస్టన్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
నిర్విరామంగా గంటపాటు కీబోర్డ్ ప్రదర్శన
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ అంతర్జాతీయ పోటీలో ప్రీస్టన్ మిగిలిన కళాకారులతో పోటీ పడుతూ, నిర్విరామంగా గంటపాటు కీబోర్డ్ వాయించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రపంచ వేదికపై ఆయన చూపిన ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆయనకు ఈ రికార్డును ఖరారు చేశారు.
గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి అంతర్జాతీయ వేదికపై గిన్నీస్ రికార్డు సృష్టించిన ప్రీస్టన్‌ను అశ్వరావుపేట మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంగీతాభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. తమ కుమారుడు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై తల్లిదండ్రులు వెంకటేశ్వర రావు, ప్రమీల ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రీస్టన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

