కలం, వెబ్ డెస్క్ : పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల రైతులు దేశ్ బచావో మోర్చా పిలుపుతో (Farmers Protest) ఢిల్లీ వైపు దూసుకువెళ్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద భారీ ఎత్తున ‘మహాపంచాయత్’ మెగా ర్యాలీ నిర్వహించేందుకు పాటియాలా తదితర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివస్తున్న రైతులను పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభూ బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతులు హర్యానాలోకి ప్రవేశించకుండా పోలీసులు కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అమెరికా నుండి తక్కువ ధర కలిగిన, సబ్సిడీలతో కూడిన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను భారత మార్కెట్లలోకి అనుమతించడం వల్ల ఇక్కడి స్థానిక రైతులకు, పాడి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

