కలం, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం మరోసారి విద్యుత్ ఆర్టిజన్లు (Electricity Artisans) ఆందోళనకు సిద్ధమయ్యారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆఫీసు ముందు మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏండ్ల తరబడి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ తమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నదని ఆర్టిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఏప్రిల్ లో నిరవధిక సమ్మె చేపట్టామని, విద్యుత్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం హామీ మేరకు తిరిగి విధుల్లో చేరామని.. ఇన్నిరోజులవుతున్నా హామీలు అమలు కావడం లేదని ఆజామాబాద్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ తీగల సైదులు గౌడ్ ఒక ప్రకటనలో ఆవేదన వెలిబుచ్చారు. అందుకే మరోసారి రోడ్డెక్కాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పర్మినెంట్ చేస్తామని అప్పటి నాయకులు చెబితే నమ్మినం. తెలంగాణ కోసం మా వంతుగా ముందుండి కొట్లాడినం.
కానీ, ఇప్పటికీ మమ్మల్ని ఎట్లున్నరు అని అడిగే నాథుడు లేడు. పర్మినెంట్ చేయకపోగా.. మా బతుకులకు గ్యారంటీ లేకుండాపోయింది. తోటి కార్మికులు కరెంట్ స్థంభాలపైనుంచి కిందపడి చనిపోతుంటే మా గుండెలు ఆగమవుతున్నాయి. పొద్దున పనిమీద బయటికి పోతే సాయంత్రానికి ఇంటికి వస్తామన్న నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా డిమాండ్లను పరిష్కరించాలి” అని సైదులు గౌడ్ కోరారు. మహాధర్నాకు ఆర్జిజన్లు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

