కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. జిల్లాలోని అత్యంత ప్రాచుర్యం పొందిన నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ టెంపుల్ సిటీ కారిడార్‌ను (Temple City Corridor) ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది. ఈ బృహత్తర ప్రణాళిక ద్వారా అటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఇటు ఉమ్మడి జిల్లాలో పర్యాటక రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదిత కారిడార్ పరిధిలోకి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం, గోదావరి తీరాన వెలసిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలను చేర్చనున్నారు. ఇటీవల కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు పరిహారం అందజేసేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ప్రాజెక్టుపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. ఈ నాలుగు క్షేత్రాలను కలిపి ఒకే టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని, తద్వారా ఈ ప్రాంతాలకు సరికొత్త శోభ తీసుకువస్తామని ఆయన ప్రకటించారు.
మంత్రి ప్రకటనతో ఈ పురాతన దేవాలయాల అభివృద్ధికి మార్గం సుగమం కావడమే కాకుండా, రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారిడార్ (Temple City Corridor) ఏర్పాటు వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. దీనిపై కరీంనగర్ జిల్లా వాసులతో పాటు పుణ్యక్షేత్రాల అర్చకులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: మియాపూర్‌లో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Follow Us On: Instagram


