కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కొత్తపల్లి మండలం పరిధిలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఇసుక డంప్‌లను గుర్తించి సీజ్ చేశారు. రాములపల్లి గ్రామ పరిధిలో పెద్ద ఇసుక డంప్‌ను గుర్తించగా.. అక్కడ సుమారు 50కు పైగా ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుక స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి పరిధి శాంతినగర్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్, జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో లంబాడి రవి అనే వ్యక్తి కాంపౌండ్‌లో సుమారు 30కు పైగా ట్రాక్టర్ల లోడుల ఇసుకను సీజ్ చేశారు. మొత్తంగా ఈ దాడుల్లో దాదాపు 80కు పైగా ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ గుర్తించి, విచారణ కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.
క్రిమినల్ కేసలు నమోదు చేస్తాం: సీపీ గౌష్ ఆలం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

