కలం, వెబ్ డెస్క్ : సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ డైట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన వీరమాచినేని రామకృష్ణ (Veeramachaneni Ramakrishna)తో పాటు డాక్టర్ కోటేశ్వరరావులపై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బాధితుడైన 30 ఏళ్ల లా విద్యార్థి కథనం ప్రకారం.. టైప్-1 డయాబెటిస్‌ను నయం చేస్తామంటూ అతని నుంచి రూ.26,000 వసూలు చేశారు. అనంతరం వారి సలహా మేరకు ఇన్సులిన్ వాడటం పూర్తిగా నిలిపివేశాడు.
ఇన్సులిన్ ఆపేసిన కేవలం రెండు రోజుల్లోనే ఆ విద్యార్థి తీవ్రమైన డయాబెటిక్ కీటోయాసిడోసిస్, డీహైడ్రేషన్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిపాలయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోసం, ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, క్రిమినల్ కుట్రతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) యాక్ట్, డ్రగ్స్ & మ్యాజిక్ రెమెడీస్ చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సరైన వైద్య అర్హతలు లేకుండా చికిత్సల పేరిట ప్రాణాపాయం కలిగించినందుకు నష్టపరిహారం కోరుతూ నాంపల్లి కన్స్యూమర్ కోర్టులో కూడా బాధితుడు పిటిషన్ దాఖలు చేశారు.

