కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ (Karimnagar Police) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు ఉదయం కొత్తపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులమల్యాల గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి, సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ డంపులో మొత్తం 30 ట్రాక్టర్ల లోడుల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

