Mobile Popup Ad
Mobile Popup Ad

కోరపల్లి రోడ్డు దోపిడీ.. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ రహదారిపై జరిగిన దోపిడీ ఘటన (Korapalli Road Robbery) ను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. మే 20 రాత్రి కోరపల్లి గ్రామం వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు.

అనంతరం బాధితులను ఎఫ్‌సీఐ గోదాం సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి నగదు, బంగారం ఉంగరం దోచుకోవడంతో పాటు ఫోన్‌పే ద్వారా సుమారు రూ.38 వేల వరకు బలవంతంగా వసూలు చేశారు. అంతటితో ఆగకుండా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని బాధితులను బెదిరిస్తూ రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న జమ్మికుంట పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

మే 21 ఉదయం సైదాబాద్ ఎక్స్‌రోడ్ – కోరపల్లి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.14 వేల నగదు, అర తులం బంగారం ఉంగరం, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన వారిలో పల్లపు ఈశ్వర్ అలియాస్ బన్నీ, పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చుక్కారపు అఖిలేష్, మొగుళ్ల రాకేష్, పల్లపు మహేష్ (మల్లయ్య కుమారుడు), పల్లపు మహేష్ (రాములు కుమారుడు), తప్పేలా వంశీ ఉన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసీపీ మాధవి తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ రవి, హుజూరాబాద్ ఎస్ఐ రాధాకృష్ణ, చిట్టిబాబు ఐడి పార్టీ సిబ్బందిని ఏసీపీ మాధవి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>