కలం, వెబ్ డెస్క్ : మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన అస్మిత చలిహా (Asmita Chaliha) ఓటమి చవిచూశారు. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ జెర్స్‌ఫెల్ట్ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. అస్మిత నిష్క్రమణతో ఈ టోర్నమెంట్‌లో భారతదేశ సవాల్ పూర్తిగా ముగిసిపోయింది. ఈ టోర్నమెంట్‌లో బుధవారం నుంచే భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. మొదటి రోజే పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ ఎస్ ప్రణయ్ ఓడిపోయారు. ఆ తర్వాత గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో మాళవిక కూడా ఇదే డెన్మార్క్ ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు.
మరో మ్యాచ్‌లో దేవిక సిహాగ్, చైనా టాప్ సీడ్ చెన్ యుఫెయ్ చేతిలో 21-16, 21-13 తో వెనుదిరిగారు. డబుల్స్ విభాగాల్లోనూ మనవాళ్లకు అదృష్టం కలిసిరాలేదు. పురుషుల డబుల్స్‌లో బరిలోకి దిగిన ఏకైక భారత జోడీ ఎంఆర్ అర్జున్, హరిహరన్ అంసకరుణన్ చైనా జంట చేతిలో 21-14, 21-15 తో ఓడిపోయారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి కానపురం, రాధికా శర్మ జోడీ అమెరికా ప్లేయర్ల చేతిలో 12-21, 25-27 తో పరాజయం పాలయ్యారు. ఇక శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌పైనే అందరి ఆశలు నిలిచాయి.
ప్రపంచ 71వ ర్యాంకర్ అయిన అస్మిత, 23వ ర్యాంకర్ ప్రత్యర్థితో తలపడ్డారు. 61 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అస్మిత మొదటి గేమ్‌ను 23-21 తో గెలిచి మంచి ఆధిక్యం సాధించారు. రెండో గేమ్‌లోనూ ఒక దశలో 10-5 తో ముందంజలో ఉన్నా, ప్రత్యర్థి పుంజుకోవడంతో 21-18 తో ఆ గేమ్‌ను చేజార్చుకున్నారు. ఇక విజేతను తేల్చే ఆఖరి గేమ్‌లో డెన్మార్క్ ప్లేయర్ పూర్తి నియంత్రణ సాధించి 21-11 తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

