దొంగలు దొరికేనా? ఖాకీలకే షాకిచ్చిన మాస్టర్ ప్లాన్!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నడిబొడ్డున కలకలం రేపిన పిఎంజే జ్యువెలరీ (PMJ Jewellers) దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరు సాదాసీదా దొంగలు కాదు.. పక్కా ప్రొఫెషనల్ ‘గోల్డ్ థీఫ్’ ముఠా అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడానికి వీరు వేసిన ప్లాన్ చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోతున్నారు. పక్కా స్కెచ్ తో వచ్చిన దొంగలు అసలు దొరుకుతారా? వారం రోజులైనా పోలీసులకు అంతుచిక్కడం లేదంటే అర్దం ఏమిటి? అన్న సంశయంలో ప్రజలు ఉన్నారు. ఈ ముఠా నెల రోజుల క్రితమే నగరానికి చేరుకొని, షోరూమ్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

దొంగలు సాధారణంగా సొంత వాహనాలపై రెక్కీ నిర్వహిస్తారు. కానీ, ఈ ముఠా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకకుండా ఉండటానికి ఊళ్ల మధ్య ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. దొంగతనానికి వాడాల్సిన బైక్‌ను నెల రోజుల ముందే పెద్దపల్లిలోని ఒక పెయిడ్ పార్కింగ్‌లో ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. దోపిడీకి సరిగ్గా ఒక్కరోజు ముందే ఆ బైక్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, పెద్దపల్లి, ధర్మపురిలోని లాడ్జీల్లో బస చేశారు. దోపిడీ తర్వాత ఎక్కడ బైక్ వదలాలి, ఏ భారీ వాహనం ఎక్కి సరిహద్దులు దాటాలి అనే దానిపై ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.

ధర్మపురి పుష్కర్ ఘాట్ వద్ద అపాచీ బైక్‌ను వదిలేసి, వేరే వాహనంలో పరారైనట్లు సీసీ కెమెరా దృశ్యాలు చెబుతున్నాయి. కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో ఈ ముఠా కోసం గాలిస్తున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా జరిగిన పలు భారీ నగల దోపిడీల్లో ఈ అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలు, నకిలీ గుర్తింపు కార్డుల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also:  విజయ్ అనే నేను.. సీఎం‌గా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>