కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో లాడ్జీలు నిర్వహించే యాజమాన్యాలు పోలీసు నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) సూచించారు. నిబంధనలు పాటించి నేర నియంత్రణలో పోలీసులకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీల నిర్వాహకులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ (SP Rohith Raju) మాట్లాడుతూ.. లాడ్జీలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతతో పని చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారితే యాజమాన్యాలదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రతి అతిథి నుండి ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఒక వేళ లాడ్జీల్లో విదేశీయులు బస చేస్తే 24 గంటల్లోపు ఫామ్-సీ ద్వారా ఆన్‌లైన్‌లో పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వీటితో పాటు లాడ్జీ గదుల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి పనులకు తావు ఇవ్వకూడదన్నారు. అనుమానిత వ్యక్తులు లేదా లగేజీ కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని లాడ్జీ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ లు, లాడ్జీల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: దొంగలు దొరికేనా? ఖాకీలకే షాకిచ్చిన మాస్టర్ ప్లాన్!
Follow Us On: WhatsApp

