కరీంనగర్‌లో టెండర్ల కలకలం.. 71 అభివృద్ధి పనుల రద్దు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలో టెండర్ల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. వివాదాస్పదంగా మారిన UIDF (అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్) పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనుల టెండర్లను అధికారులు రద్దు చేశారు. మొత్తం 71 పనులకు సంబంధించిన సింగిల్ టెండర్ల షెడ్యూళ్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ బల్దియా పరిధిలో దాదాపు రూ.50 కోట్లు నిధులతో అభివృద్ధి పనుల కోసం పది రోజుల క్రితం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. నగరంలోని 66 డివిజన్ల పరిధిలో మొత్తం 87 అభివృద్ధి పనులకు గానూ ఈ ప్రక్రియ జరిగింది.

అయితే, ఇందులో సుమారు రూ. 39.50 కోట్లు విలువైన 71 పనులకు కేవలం సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 15 పనులకు ఒకటి కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడగా.. ఒక పనికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.ఈ నేపథ్యంలో ఎటువంటి పోటీ లేకుండా ఏకపక్షంగా సింగిల్ టెండర్లు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వామపక్ష, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులతో పాటు, సివిల్ కాంట్రాక్టర్ నారాయణస్వామి శనివారం మున్సిపల్ కమిషనర్‌కు దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.

నిబంధనల ప్రకారం.. మొదటిసారి టెండర్లు నిర్వహించినప్పుడు సింగిల్ టెండర్లు వస్తే పరిశీలన అనంతరం వాటిని రద్దు చేసే అధికారం నిర్వహణ అధికారి అయిన కమిషనర్‌కు ఉంటుంది. ఈ విషయంపై కమిషనర్ తీవ్రంగా పరిగణించి రద్దు చేశారు. ​కమిషనర్ ఆదేశాల మేరకు ఈ 71 పనుల సింగిల్ టెండర్లను రీకాల్ చేసినట్లు ఎస్‌ఈ రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. ఒకవైపు విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని కార్పొరేటర్లు, ప్రజలు ఎదురుచూస్తుండగా.. ఈ టెండర్ల రద్దుతో పనులకు బ్రేక్ పడటం స్థానికంగా నిరాశను మిగిల్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>